గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై శనివారం మద్యాహ్నం జరిగిన ప్రమాదంలో పడవ తరగతి విద్యార్ధిని ప్రభాతి (19) మృతి చెందింది. ఆమె శనివారం పదో తరగతి పరీక్ష వ్రాసి అన్న బైక్‌పై ఇంటికి తిరిగి వెళుతుండగా, గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై ఎదురుగా వస్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఢీ కొట్టడం ఆమె ఎగిరి పడి బస్సు వెనుక చక్రాల కింద పడి చనిపోయింది.
రాయదుర్గం పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఒడిశాకు చెందిన ఆమె తల్లి తండ్రులు జీవనోపాధి కోసం ఎనిమిదేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చారు. గోపన్‌పల్లి టీన్‌జీఓస్ కాలనీలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఇరుగు పొరుగు ఇళ్ళలో వంటపని చేసుకొని జీవిస్తున్నారు. వారికి ఓ కుమారుడు సుమంత్, ఓ కుమార్తె ప్రభాతి ఉన్నారు.
వారి కుమార్తె ప్రభాతి డైమండ్ హిల్స్ కాలనీలో విజయభారతి హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆమెకు రాయదుర్గం జిల్లా పరిషత్ హైస్కూల్లో పరీక్షా కేంద్రం పడటంతో ప్రతీరోజూ ఆమెను అన్న సుమంత్ తన బైక్‌పై అక్కడకు తీసుకువెళ్ళి తీసుకువస్తున్నాడు.
శనివారం కూడా అలాగే చెల్లిని ఇంటికి తిరిగి తీసుకువస్తుండగా ఈ రోడ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సుమంత్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బస్సు డ్రైవర్ బలరామ్‌ని అదుపులో తీసుకున్నారు.