ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్ధన రావు (86)పై హత్యకు గురయ్యారు. ఆయన మనుమడు (కూతురు కొడుకు) కీర్తితేజ కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. అడ్డువచ్చిన తల్లి సరోజినీ దేవిపై కూడా కత్తితో దాడి చేసి పారిపోయాడు.
పంజగుట్ట పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఏలూరుకు చెందిన జనార్ధనరావు గత కొన్నేళ్ళుగా సోమాజీగూడలో నివాసం ఉంటున్నారు. తన కంపెనీల బాధ్యతలను పిల్లలకు అప్పగించేసి విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇటీవలే తన పెద్ద కుమార్తె కుమారుడు శ్రీకృష్ణని వెల్జాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు డైరెక్టర్‌గా నియమించారు.
రెండో కుమార్తె సరోజినీదేవి కుమారుడు కీర్తితేజ పేరిట రూ.4కోట్లు విలువైన కంపెనీ షేర్లు బదలాయించారు. ఆస్తుల పంపకాల విషయంలో తమకి అన్యాయం జరుగుతోందని భావించిన సరోజినీదేవి, ఆమె కుమారుడు గురువారం రాత్రి సోమాజీగూడలో జనార్ధనరావు ఇంటికి వచ్చారు.
ఆ సందర్భంగా వారి మద్య వాగ్వాదం జరిగింది. సరోజినీదేవి టీ చేసేందుకు వంటింట్లోకి వెళ్ళిన్నప్పుడు కీర్తితేజ కత్తితో తాతని విచక్షణా రహితంగా పొడవసాగాడు. తండ్రి అరుపులు విని వచ్చిన సరోజినీదేవి కొడుకుని అడ్డుకోబోయారు. కానీ ఆమెను కూడా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు.
బిల్డింగ్ వాచ్ మ్యాన్ వీరబాబు అతనిని పట్టుకోబోతే కత్తితో బెదిరించి పారిపోయాడు. సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన సరోజినీదేవిని హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకొని కీర్తితేజ కోసం గాలించి శనివారం అరెస్ట్ చేశారు.
జనార్ధన రావు టీటీడీకి, రెండు తెలుగు రాష్ట్రాలలో పలు స్వచ్ఛంద సంస్థలు, అనాధ శరణాలయాలకు కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చారు. అటువంటి ఉదార హృదయం కలిగిన ఆయన సొంత పిల్లలకు, మనుమాలకు అన్యాయం చేస్తారనుకోలేము. కానీ మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన మనుమడు కీర్తితేజ చేతిలో ఆయన హత్య చేయబడటం చాలా బాధాకరం.