మహీంద్రా కార్ షో రూమ్‌లో భారీ అగ్నిప్రమాదం

January 24, 2025
img

హైదరాబాద్‌, కొండాపూర్‌లో గల మహీంద్రా కార్ షో రూమ్‌లో శుక్రవారం ఉదయం సుమారు 6 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.10 కోట్లు విలువైన 12 కార్లు కాలి బూడిదయ్యాయి. షో రూమ్‌ వెనుకే ఉన్న స్పేర్ పార్ట్స్ గోదాముకి కూడా మంటలు వ్యాపించడంతో దానిలో ఉన్న సుమారు రూ.4 కోట్లు విలువైన స్పేర్ పార్ట్స్ కూడా కాలి బూడిదయ్యాయి. మొదట అక్కడి నుంచే మంటలు వ్యాపించిన్నట్లు సమాచారం. బహుశః విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వలన ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.  

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఈ షో రూమ్ పక్కనే స్కోడా కార్ షోరూమ్, సహర్ష్ ఓయో రూమ్ ఉన్నాయి. వాటికి మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. 

సమీప ప్రాంతంలో నివసిస్తున్న మహీంద్రా ఉద్యోగులు కొందరు అగ్నిప్రమాదం సంగతి తెలుసుకుని వెంటనే అక్కడకు చేరుకొని షోరూమ్‌లో నుంచి నాలుగు కార్లను బయటకు తీసుకురావడంతో ఆ మేరకు నష్టం తగ్గింది.

ఈ అగ్నిప్రమాదంలో మహీంద్రా షో రూమ్, దానిలో ఫర్నీచర్, కంప్యూటర్స్, ఏసీలు వగైరా ఖరీదైనవన్నీ కాలి బూడిదైపోయాయి. ఈ అగ్నిప్రమాదం వలన సుమారు 20-25 కోట్లు వరకు ఆస్తినష్టం కలిగిన్నట్లు అంచనా!   


Related Post