ఒక్కోసారి రోడ్లపై వాహనాలు బోర్లా పడినప్పుడు మద్యం, కూరగాయలు లేదా మరొకటో పడిపోతే చుట్టుపక్కల ప్రజలు వచ్చి పట్టుకుపోతుంటారు. అదేవిదంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ మొదలుపెట్టగానే జగన్ పుణ్యమాని అందరికీ చేపలు లభిస్తున్నాయి! ఎలా అంటే చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పుకోవాలి.
ఇదివరకు అంటే 2014-2019లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో భారీ భవనాలు నిర్మించేందుకు పునాదులు వేశారు. తర్వాత వచ్చిన జగన్ అమరావతిని వద్దనుకొని 5 ఏళ్ళు పాడుబెట్టేశారు.
దాంతో ఎక్కడికక్కడ చెరువులు ఏర్పడ్డాయి. వాటిలో భారీగా చేపలు పెరిగాయి. కానీ ఈ విషయం ఎవరూ గుర్తించలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతి పనులు మొదలుపెట్టించడంతో పునాదుల చుట్టూ నిండిపోయిన నీటిని మోటర్లు పెట్టి తోడి బయట పోస్తుంటే నీటిలో పెద్ద పెద్ద చేపలు కనబడ్డాయి. దాంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకొని చేపలు పట్టుకుంటున్నారు.
ఇప్పటి వరకు నాలుగైదు భవనాల పునాదుల వద్ద పేరుకుపోయిన నీటిలో సుమారు 500 కేజీలకు పైగా పెద్ద పెద్ద చేపలు దొరికాయి. వాటిని గ్రామస్తులు సమీపంలోనే ఉన్న గుంటూరు, విజయవాడకు తరలించి అమ్ముకుంటున్నారు. జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు!