బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేసి బాంద్రా కోర్టులో హాజరుపరచి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. అతని పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని పోలీసులు గుర్తించారు.
అతను ఆరు నెలల క్రితం బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ముంబైకి వచ్చి ఉంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ అతను ఏడేళ్ళ క్రితమే కుటుంబంతో సహా ముంబయి వచ్చి నివాసం ఉంటున్నాడని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు.
అతను బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చాడా లేదా అనేది ముఖ్యం కాదు. అంత పటిష్టమైన భద్రత, పలువురు సిబ్బంది, ఇంటి లోపలా, బయట అనేక సీసీ కెమెరాలు ఉన్న ఇంట్లోకి అతను దొంగతనానికి జొరాబడ్డాడంటే నమ్మశక్యంగా లేదు. కనుక అతను నిజంగానే సైఫ్ ఆలీ ఖాన్ ఇంట్లో దొంగతనానికే జొరబడ్డాడా?లేదా ఎవరైనా అఆయనని హత్య చేయమని పంపారా?అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, అతను గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు మెట్ల మార్గంలో సైఫ్ ఆలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి ముందుగా అతని కుమారడు జేహ్ గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఆయా గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ ఆలీ ఖాన్ పరుగున వచ్చి ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అతను తప్పించుకునే ప్రయత్నంలో తన వద్ద ఉన్న కత్తితో పొడిచి పారిపోయాడు.