నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలతో సహా దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనాలు, పూజలు జరుగుతున్నాయి. తిరుమల నిన్న అర్దరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
తర్వాత ధనుర్మాస్య ప్రత్యేక పూజలు, నిత్య కైంకర్యాలు జరిపిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు అనుమతించారు. తర్వాత తిరుపతిలో స్థానికులకు దర్శనాలకు అనుమతించారు. ఆ తర్వాత సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయమంతా రంగురంగు విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భారీ సంఖ్యలో వీఐపీలు తరలివస్తుండటంతో సామాన్య భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
వైకుంఠ ఏకాదశినాడు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం, మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. కనుక తిరుమలతో సహ దేశంలో అన్ని వైష్ణవ ఆలయాలలో ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి, భద్రాద్రి, ధర్మపురి, చిలుకూరి బాలాజీ తదితర వైష్ణవాలయాలలో కూడా అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అన్ని ఆలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. యాదాద్రిలో స్వామివారు గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.