తిరుపతి పట్టణంలో బైరాగి పట్టెడ వద్ద ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనం కౌంటర్ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. దీనిలో ఐదుగురు భక్తులు మృతి చెందారు. మరో 48 మంది గాయపడ్డారు.
ఈ నెల 10,11,12 తేదీలలో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈరోజు (గురువారం) ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్స్ జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. టోకెన్లు జారీ చేసేందుకు తిరుపతి పట్టణంలో టీటీడీ 8 కౌంటర్లు ఏర్పాటు చేసింది. వాటి కోసం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి బుధవారం ఉదయం నుంచి టికెట్స్ కౌంటర్స్ జారీ చేసే ప్రాంతాలలో ఎదురుచూస్తున్నారు.
బైరాగి పట్టెడ వద్ద గల ప్రభుత్వం పాఠశాలలో కౌంటర్ ఏర్పాటు చేయడంతో పక్కనే ఉన్న శ్రీ పద్మావతీ పార్కులో బుదవారం ఉదయం నుంచే వేలాదిమంది భక్తులు చేరుకున్నారు. సాయంత్రానికి మరింత మంది జనం గుమిగూడారు.
వారిలో ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో అతనిని ఆస్పత్రికి తరలించేందుకు రాత్రి 8.15 గంటలకు పోలీసులు గేట్లు తెరవబోయారు. క్యూలైన్లో ప్రవేశించేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన జనం ఒక్కసారిగా లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. మరో 48 మంది గాయపడ్డారు. క్షత గాత్రులను పోలీసులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ హాస్పిటల్స్‌కు తరలించారు.
చనిపోయినవారిలో నర్సీపట్నంకు చెందిన బి. నాయుడు బాబు(51), విశాఖపట్నానికి చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), బళ్లారికి చెందిన నిర్మల(50)లుగా పోలీసులు గుర్తించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, కమీషనర్ మౌర్య, ఆర్డీవో, టీటీడీ ఈవో శ్యామల రావు, టీటీడీ విజిలెన్స్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వివరాల కోసం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నంబర్: 0877-2236007కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.