మోహన్ బాబుకి హైకోర్టులో ఊరట.. పోలీస్ స్టేషన్‌లో షాక్!

December 12, 2024
img

ప్రముఖ నటుడు మోహన్ బాబుకి గత నాలుగైదు రోజులుగా చాలా విచిత్రమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయన రెండో కొడుకు మంచు మనోజ్ దాడి చేసి ఆయనని గాయపరిచాడు. పహాడీ షరీఫ్ పోలీసులకు కొడుకు మనోజ్‌పై పిర్యాదు చేశారు కూడా. తండ్రిపై కొడుకు దాడి చేయడం, పరస్పరం పోలీస్ కేసులు పెట్టుకోవడం రెండూ విచిత్రమైనవే. 

ఆ తర్వాత తన కుమారులిద్దరూ, వారి బౌన్సర్లు ఆయన నివాసం వద్ద ఘర్షణ పడటం మోహన్ బాబు దంపతులు తట్టుకోవడం చాలా కష్టమే. 

ఆ ఆవేశంలో ఆయన మీడియా ప్రతినిధి చేతిలో మైక్ లాక్కొని విసిరికొట్టడంతో అది మరో కేసు అయ్యింది. మీడియా ప్రతినిధి పిర్యాదు మేరకు పోలీసులు ఆయన హత్యాయత్నం సెక్షన్ 109 కింద కేసు నమోదు చేశారు. 

ఈ గొడవలతో  తీవ్ర ఆందోళన చెందిన మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవలసి వచ్చింది. ఆయన కొడుకు మనోజ్ పిర్యాదుతో మోహన్ బాబుపై కేసు నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీస్ పంపారు. కానీ ఆయన హైకోర్టుని ఆశ్రయించడంతో ఆ నోటీసుపై ఈ నెల 24 వరకు స్టే విధించడంతో మోహన్ బాబుకి ఊరట లభించింది. 

ఆయన ఇద్దరు కొడుకులకే రాచకొండ సీపీ సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చి, బాయిండోవర్ చేసి ఇంటికి పంపించేశారు కనుక పెద్దాయన మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకుంటారని అనుకోలేము.

కానీ మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ఆయనపై సెక్షన్ 109 కింద కేసు నమోదు చేయడమే చాలా ఇబ్బందికరంగా మారవచ్చు.

ఇప్పటికే మంచు మనోజ్, మంచు విష్ణు సోదరులిద్దరూ తండ్రి తరపున మీడియాకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు కనుక అతనిని ఒప్పించి ఆ కేసు వాపసు తీసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అతను ఒప్పుకుంటే మోహన్ బాబు ఈ సమస్య నుంచి కూడా బయట పడిన్నట్లే.

కానీ కొడుకుల ఆస్తి తగాదాలు ఇంకా అలాగే ఉన్నాయి. కనుక వాటినీ సామరస్యంగా పరిష్కరించాల్సి ఉంటుంది.

Related Post