తిరుమల, తిరుపతిలో కుండపోతగా వర్షం

December 12, 2024
img

బంగాళాఖాతంలో మళ్ళీ అల్ప పీడనం ఏర్పడటంతో బుధవారం రాత్రి నుంచి తిరుమల కొండ మీద, దిగువన తిరుపతి పట్టణంలో కుండపోతగా వాన కురుస్తోంది. తిరుమల కొండపై శ్రీవారి ఆలయం ఎదుట ఉండే  ప్రదేశంతో సహా మాడవీధులు నీళ్ళతో నిండిపోయాయి.

భారీ వర్షం కురుస్తుండటంతో ఘాట్  రోడ్‌లో కొండ చరియాలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది కనుక టీటీడీ సిబ్బంది ఘాట్ రోడ్‌ని నిరంతరంగా పరిశీలిస్తూ, వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.

శ్రీవారి పాదాలు, పాప వినాశనం, గోగర్భం పూర్తిగా నీళ్ళతో నిండిపోయినందున అటువైపు వెళ్ళే మార్గాలను మూసివేసి భక్తులను వెనక్కు తిప్పి పంపించేస్తున్నారు. 

దిగువన తిరుపతి పట్టణంలో కూడా పలు ప్రాంతాలలో రోడ్లు నీళ్ళతో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఇతర మార్గాలలోకి మళ్ళిస్తున్నారు. కపిలతీర్ధంలో కొండపై నుంచి ఉదృతంగా నీరు ప్రవహిస్తుండటంతో టీటీడీ సిబ్బంది భక్తులను లోనికి అనుమతించడం లేదు. తిరుపతి సమీపంలో గల మాల్వాడీ గుండం జలపాతం పొంగి ప్రవహిస్తోంది. 


Related Post