నాపై కేసు కొట్టేయండి: అల్లు అర్జున్‌

December 11, 2024
img

ఈ నెల 4న రాత్రి 9.30 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దగల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. అందుకు అల్లు అర్జున్‌, సంధ్య థియేటర్ యాజమాన్యం బాధ్యులంటూ చిక్కడపల్లి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన ఆ కేసుని కొట్టివేయవలసిందిగా కోరుతూ అల్లు అర్జున్‌ ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ వేశారు. హైకోర్టు దానిని విచారణకు స్వీకరించింది. బహుశః బుధవారం దానిపై విచారణ చేపట్టవచ్చు. 

  అల్లు అర్జున్‌, సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగి మహిళా చనిపోయిందని కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ అక్కడికి వస్తున్న విషయం సంధ్య థియేటర్ యాజమాన్యానికి తెలిసి ఉన్నప్పటికీ అభిమానులను కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆదేవిదంగా అల్లు అర్జున్‌ సిబ్బంది కూడా ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని పోలీసుల ఆరోపణ. ముందుగా తమకు తెలియజేసుంటే అందుకు తగ్గట్లు బ్యారికేడ్లు, అదనపు పోలీస్ సిబ్బందిని మోహరించి తొక్కిసలాట జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవారిమని, కానీ వారు కనీసం మాట మాత్రంగానైనా ఆ సమయంలో అల్లు అర్జున్‌ థియేటర్ వద్దకు వస్తున్న సంగతి ముందుగా చెప్పకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఓ మహిళా మృతికి కారకులయ్యారని పేర్కొన్నారు. 

రేవతి కుటుంబానికి అల్లు అర్జున్‌ సంతాపం తెలియజేసి రూ.25 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తానని ప్రకటించారు. ఈ తొక్కిసలాటలో నాలిగిపోయి తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు శ్రీ తేజ్ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులు మొత్తం తానే భరిస్తానని అల్లు అర్జున్‌ హామీ ఇచ్చారు.

Related Post