ప్రముఖ నటుడు మోహన్ బాబుకి హైకోర్టులో ఊరట లభించింది. మంచు మనోజ్, మీడియా ప్రతినిధులు ఆయనపై రాచకొండ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయడంతో ఈరోజు ఉదయం 10.30 గంటలకు మోహన్ బాబు విచారణకు హాజరు కావలసి ఉంది.
కానీ నిన్న జల్పల్లిలో తన ఇంటి వద్ద జరిగిన గొడవలతో ఆయన తీవ్ర ఆందోళనకు అస్వస్థతకు గురవడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కనుక పూర్తిగా కొలుకునే వరకు సమయం ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టి, ఈ నెల 24 వరకు పోలీస్ సమన్లపై స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణ అదే రోజుకి వాయిదా పడింది.
మనోజ్-మౌనికలకు అండగా బయట నుంచి కొందరు వ్యక్తులు రావడంతో ఈ గొడవలు జరిగిన్నట్లు తెలుస్తోంది. కనుక మోహన్ బాబుకి పోలీసులతో రక్షణ కల్పించాలని ఆయన తరపు న్యాయవాది అభ్యర్ధనని ప్రభుత్వం తరపు న్యాయవాది తిరస్కరించారు. ప్రతీ రెండు గంటలకీ పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్ళి వస్తున్నారని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు.