మంచులో బయటి వ్యక్తులే చిచ్చు పెట్టారా?

December 11, 2024
img

మంచు కుటుంబంలో గొడవలు రచ్చకెక్కడం చాలా బాధాకరమే. కానీ వారంతట వారే మీడియా ముందుకు వచ్చి కుటుంబంలో జరుగుతున్న గొడవలను బయటపెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో పిర్యాదులు చేసుకున్నారు. కనుక ఇప్పుడు ఎవరినో నిందించి ప్రయోజనం లేదు.  

మంచు విష్ణు ఏమన్నారంటే, “మా కుటుంబంలో ఈవిదంగా గొడవలు జరుగుతుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. నేను కన్నప్ప సినిమా పని మీద లాస్ ఏంజల్స్‌లో ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ వచ్చేసరికే ఇంత రాద్దాంతం జరిగింది. నేను ఇక్కడ ఉండి ఉంటే ఇంతవరకు రానిచ్చేవాడినే కాదు. 

జరిగింది జరిగిపోయింది. ప్రతీ కుటుంబంలో ఇటువంటి సమస్యలు ఉంటాయి. మా కుటుంబంలో కూడా ఉన్నాయి. కానీ మేము సెలబ్రెటీలు కావడం వలన మరింత ఎక్కువ ఫోకస్ అవుతున్నాము. మా కుటుంబంలో ఎవరికీ మీడియాపై దాడి చేసే ఆలోచన కూడా రాదు. కానీ నిన్న ఆవేశంలో ఏదో అలా జరిగిపోయింది. అందుకు నేను మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెపుతున్నాను. 

అలాగే మా కుటుంబంలో జరుగుతున్న ఈ గొడవలను సెన్సేషన్ క్రియేట్ చేయవద్దని అభ్యర్ధిస్తున్నాను. ఇప్పటికే కొందరు చాలా అతి చేశారు. ఇంకా చేస్తున్నారు. మీడియా వారికి కూడా కుటుంబాలు ఉంటాయి. వారికీ మీడియాతో ఇటువంటి అనుభవం ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఎవరూ ఇలా అతి చేయరు. 

ఈ ఆస్తులన్నీ మా నాన్నగారి కష్టార్జితమే. కనుక అంతా ఆయన ఇష్టప్రకారమే జరగాలి. ఆయన తన ఇంట్లో ఉండనిస్తే ఉండాలి. పొమ్మంటే పోవాలి తప్ప ఆయన ఆస్తులలో వాటా అడిగే హక్కు ఎవరికీ లేదు. కొందరు బయట వ్యక్తుల వల్లనే మా కుటుంబంలో ఈ చిచ్చు రగిలింది. లేకుంటే ఇదివరకు అందరం హాయిగా కలిసి మెలిసి ఉండేవాళ్ళమే కదా?

ఈ సమస్యని మేమే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాము. కనుక అంత వరకు మా కుటుంబ, వ్యక్తిగత విషయాలలో బయటవారు ఎవరూ జోక్యం చేసుకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ ఈరోజు సాయంత్రం వేర్వేరుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ గొడవలకు మూల కారకులు ఎవరో, వారి ఈవిదంగా ఎందుకు చేస్తున్నారో సాక్ష్యాధారాలతో సహా తెలియజేస్తామని చెప్పారు. 

Related Post