నేడు రాచకొండ సీపీ ముందుకి మోహన్‌ బాబు అండ్ సన్స్

December 11, 2024
img

మంచు కుటుంబంలో మోహన్ బాబు, మనోజ్, విష్ణుల మద్య నాలుగు రోజులుగా జరుగుతున్న గొడవలు చల్లారకపోగా నానాటికీ తీవ్రమవుతున్నాయి. మోహన్ బాబుకి చెందిన జల్‌పల్లి ఫామ్‌హౌస్‌ వద్ద జరిగిన గోడవల నేపధ్యంలో రాచకొండ సీపీ వారు ముగ్గురికీ నోటీసులు పంపించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముగ్గురూ విచారణకు హాజరు కావాలని వేర్వేరుగా నోటీసులు పంపారు. 

నిన్న జల్‌పల్లి ఫామ్‌హౌస్‌ వద్ద మీడియా వెంటపడటంతో మోహన్ బాబు తీవ్ర ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. మీడియా దాడి మరో కధగా తయారైంది. ఫామ్‌హౌస్‌ వద్ద పోలీసుల సమక్షంలోనే మనోజ్, విష్ణుల బౌన్సర్లు పరస్పరం దాడి చేసుకోవడాన్ని సీపీ తీవ్రంగా పరిగణించారు. ఈ గొడవలన్నిటిపై వివరణ ఇచ్చేందుకు ముగ్గురికీ వేర్వేరుగా నోటీసులు పంపారు. 

ఈ ఘటనలతో తీవ్ర మనస్తాపం చెందిన మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ పేరిట ఓ ఆడియో సందేశం విడుదల చేశారు.

దానిలో తాను మనోజ్‌ని చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచి విద్యాబుద్దులు నేర్పిస్తే చివరికి తాగుబోతుగా మారి, ఈ గోడవలతో తన పరువు ప్రతిష్టలు గంగలో కలిపావని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తులన్నీ కష్టారిజితమని కనుక వాటిపై సర్వ హక్కులు తనకే ఉన్నాయని, వాటిని తాను ఏమైనా చేసుకుంటానని, ఎవరికైనా వ్రాసి ఇస్తానని తనని ప్రశ్నించే అధికారం మనోజ్‌తో సహయ ఎవరికీ లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. 

మనోజ్ ఏడు నెలల పాప తన సంరక్షణలోనే ఉందని, ఆస్పత్రిలో ఉన్న తన భార్య ఇంటికి తిరిగి రాగానే పాపని పోలీసుల సమక్షంలో మనోజ్-మౌనిక దంపతులకు అప్పగించేస్తామని, ఒకవేళ వారు పాపని వద్దనుకుంటే తామే పెంచి పెద్ద చేస్తామని మోహన్ బాబు ఆ ఆడియో సందేశంలో పేర్కొన్నారు.

Related Post