మూడు మంచు కొండలు ఢీ కొంటున్నాయిగా

December 10, 2024
img

ఇంతకాలం మంచు కుటుంబంలో చాప కింద నీరులా సాగుతున్న అన్నదమ్ముల మద్య గొడవలు ఇప్పుడు కొట్టుకునే వరకు వచ్చింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం పిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలు గురించి తెలుసుకున్న మంచు విష్ణు విదేశం నుంచి హుటాహుటిన మంగళవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. 

ఆ తర్వాత కొందరు శ్రేయోభిలాషుల సమక్షంలో మంచు మనోజ్, మంచు విష్ణు మద్య తన జల్‌పల్లి ఫామ్‌హౌస్‌లో చర్చలు జరుగుతాయని మోహన్ బాబు చెప్పారు. ఆ చర్చలలో పాల్గొనేందుకు ఆయన మంచు విష్ణుతో కలిసి అక్కడకు చేరుకున్నారు. కానీ మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను ఫామ్‌హౌస్‌లో బయట ఉండమని విష్ణు ఆదేశించారు. కానీ వారు అక్కడి నుంచి కదలకపోవడంతో విష్ణు వారిని బయటకు గెంటేయమని తన బౌన్సర్లని ఆదేశించారు. దాంతో బౌన్సర్ల మద్య కాసేపు తోపులాటలు జరిగాయి. చివరికి మనోజ్ బౌన్సర్లు బయట గేటు బయటకు వెళ్ళి నిలుచోవలసి వచ్చింది. 

ఈలోగా ఫామ్‌హౌస్‌లో ఉన్న మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా మనోజ్ విలేఖరులతో మాట్లాడుతూ, “నేను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాడటం లేదు. నాది, నా భార్య బిడ్డల ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నాను. నా భార్యని, ఏడు నెలల పసిపాపని కూడా ఈ గొడవల్లోకి లాగాల్సిన అవసరం ఏముంది?

విష్నూ.. నువ్వు మగాడివైతే ధైర్యంగా వచ్చి నాతో మాట్లాడు. అంతే కానీ మద్యలో ఆడవాళ్ళు, పిల్లలని ఎందుకు లాగుతావు. నాకు చేయమని పోలీసులను ఆశ్రయిస్తే వారు కూడా నా తండ్రి మోహన్ బాబుకి, నా సోదరుడు విష్ణుకే మద్దతు ఇస్తుండటం చాలా బాధ కలిగిస్తోంది. పోలీసులు నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించలేకపోతే, న్యాయం చేయకపోతే, నాకు సాయం చేయగల ప్రతీ ఒక్కరినీ వెళ్ళి కలిసి సాయం ఆర్ధిస్తాను,” అని మంచు మనోజ్ అన్నారు.  

(NTV Entertainment Telugu)

Related Post