మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఊహాగానాలు వినిపించేవి. కానీ ఇప్పుడు మంచు మనోజ్ స్వయంగా పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో తండ్రి మోహన్ బాబుపై పిర్యాదు చేశారు. ఆయన తనపై దాడి చేసి గాయపరిచారని పిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి బంజారాహిల్స్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్ళి చికిత్స చేయించుకున్నారు.
ఈవిషయం తెలిసిన విలేఖరులు అక్కడికి వెళ్ళగా మంచు మనోజ్ కాలికి కట్టుతో కాస్త కుంటుతూ నడుస్తుండటం గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ మనోజ్ దంపతులు ‘ఇప్పుడు కాదు’ అంటూ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.
మంచు మనోజ్ ఈరోజు ఉదయం తన తండ్రిని కలిసి ఆస్తుల పంపకాల గురించి మాట్లాడేందుకు వెళ్ళారు. అక్కడ వారివురూ ఆవేశంతో గొడవ పడ్డారు. ఆ తోపులాటలో మనోజ్ కింద పడిపోయినందున కాలికి దెబ్బ తగిలి ఉండవచ్చు.
అయితే తమ మద్య ఎటువంటి గొడవా జరుగలేదని, మీడియాలో తమ గురించి తప్పుడు వార్తలు వ్రాస్తున్నారని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మోహన్ బాబు కూడా అదే పోలీస్ స్టేషన్‌లో తన కొడుకుపై పిర్యాదు చేసిననట్లు తెలుస్తోంది.
ఆస్తుల పంపకాల విషయంలో తన తండ్రి తన కంటే మంచు విష్ణుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, అతని సినిమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మంచు మనోజ్ తన సన్నిహితులకు చెప్పుకొని బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.