హైదరాబాద్, జీడిమెట్ల పారిశ్రామికవాడలో పోలిధిన్ సంచులు తయారుచేసే ఎస్ఎస్‌వీ ఫ్యాబ్ పరిశ్రమలో మంగళవారం మద్యాహ్నం మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్పటి నుంచి నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ 24 గంటల తర్వాత కూడా ఇంకా ఆ భవనంలో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆ మంటల వేడికి భవనం కూలిపోయిందంటే ఈ అగ్నిప్రమాదం తీవ్రతని అర్దమచేసుకోవచ్చు.
భవనం కింది అంతస్తులో పోలిధిన్ సంచులు తయారుచేసేందుకు వినియోగించే ప్లాస్టిక్ ముడిసరుకు భారీగా నిలువచేసి ఉంచడంతో మంటలు ఆర్పడం కష్టమవుతోంది. నిన్న మద్యాహ్నం నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరికొన్ని గంటలలో మంటలు పూర్తిగా ఆరపేస్తామని చెప్పారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అనేక పరిశ్రమలు పక్కపక్కనే ఉంటాయి. కనుక మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్లాస్టిక్ ముడిసరుకు, సంచులు మంటలలో తగులబడుతుండటంతో పరిశ్రమ నుంచి భారీగా నల్లటి పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తోంది.