మీడియా సంస్థలకు ఏఆర్ రహమాన్ లీగల్ నోటీసులు

November 24, 2024
img

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ తన భార్య సైరాభాను నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మర్నాడే ఆయన అసిస్టెంట్ మోహినీ డే కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. కనుక ఈ రెండు విడాకుల కేసులను ముడి పెడుతూ కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అయ్యింది. 

దీనిపై ఏఆర్ రహమాన్ వెంటనే స్పందిస్తూ వాటిని ఖండించారు. తనపై నిరాధారమైన వార్తలు వ్రాసినందుకు సదరు మీడియా, సోషల్ మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులు అందుకున్న 24 గంటలలో తన గురించి వ్రాసిన అసత్య వార్తలను తొలగించాలని లేకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని ఏఆర్ రహమాన్ తరపు న్యాయవాది ఆ నోటీసుల ద్వారా హెచ్చరించారు. 

తామిరువురం పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని స్పష్టంగా తెలియజేసి, తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేసినప్పటికీ తన గురించి ఈవిదంగా తప్పుడు వార్తలు వ్రాయడం చాలా బాధ కలిగించిందని ఏఆర్ రహమాన్ అన్నారు.

Related Post