ఆన్‌లైన్‌లో రోజుకో కొత్తరకం సైబర్ నేరాలు పుట్టుకొస్తున్నాయి. వాటిని సైబర్ పోలీసులు పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేలోగా మరో కొత్త రకం మోసం కనిపెడుతూ ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ఇవి కాక బయట సమాజంలో కూడా రోజుకో రకమైన మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పబ్బులు, పెద్ద హోటల్స్ కు వెళ్ళేవారిని మోసగించే గ్యాంగులు తిరుగుతున్నాయని పోలీస్ శాఖ సోషల్ మీడియాలో హెచ్చరించింది.
సాధారణంగా ఐటి కంపెనీ ఉద్యోగులు, బాగా డబ్బున్నవారే పబ్బులకి వెళ్తుంటారు. కనుక వారిని మోసగించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇది గుర్తించిన కొందరు యువతులు పబ్బులకు ఒంటరిగా వచ్చే మగవారిని చనువుగా పలకరించి మాయమాటలతో బుట్టలో వేసుకొని వారి డబ్బుతో తిని తాగుతూ పర్సులు ఖాళీ చేయించేస్తున్నారట!
వారి మాయలో పది యువకులు పబ్బులకు భారీగా బిల్లులు చెల్లించి ఆనక లబోదిబోమని మొత్తుకొంటున్నారట! కనుక హోటల్స్, పబ్బుల వద్ద ఎదురయ్యి పలకరించే అపరిచిత యువతులకు దూరంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ శాఖ హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.