తెలంగాణలో తొలిసారిగా అవాంఛనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో బెటాలియన్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు రోడ్లపై బైటాయించి ఆందోళనలు చేస్తున్నారు.
మొదట ఆదిలాబాద్‌లో పోలీసుల భార్యలు ధర్నా చేశారు. తమ భర్తలతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ ఏడాదికి నాలుగు జిల్లాలు తిప్పుతున్నారని, దీంతో తాము ఎక్కడ స్థిరపడలేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలు క్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపిస్తున్నాయి.
రంగారెడ్డి, వరంగల్, రాజన్న సిరిసిల్లా జిల్లాలలో ధర్నాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ధర్నాలో పాల్గొనడంతో పోలీసులకు వారితో ఏవిదంగా వ్యవహరించాలో అర్దం కాలేదు.
కానీ పై అధికారుల ఆదేశాల మేరకు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ వ్యానులలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించాల్సి వచ్చినప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలీసులు రోడ్లపై ధర్నాలు చేయడమే విచిత్రమనుకుంటే పోలీసులే వారినీ, వారి భార్యా పిల్లలను పోలీస్ వ్యానులలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
బెటాలియన్ పోలీసులు ఏం చెపుతున్నారంటే, తమ చేత పై అధికారులు వెట్టి చాకిరీ చేయించుకున్నారని, ఇంట్లో అంట్ల గిన్నెలు తోమడం, వారి బట్టలు ఉతకడం, వారి పిల్లలను స్కూలుకి తీసుకువెళ్ళి తీసుకు రావడం వంటి పనులు చేయాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత చేస్తున్నా తమకు ఏమాత్రం గౌరవం లభించదని, అధికారులకు తమ పనులు నచ్చకపోయినా, కోపం వచ్చినా వేరే చోటికి బదిలీ తప్పదని అన్నారు. పోలీసులు అందరికీ ఒకటే నియమ నిబంధనలు ఉండాలని, తమని పోలీసింగ్ కోసమే వినియోగించుకోవాలని బెటాలియన్ కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు.