నిజామాబాద్‌లో విషాదం.. కుటుంబం ఆత్మహత్య

October 06, 2024
img

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఓ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయి తీర్చే మార్గంలేక, ఆ ఒత్తిళ్ళు అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. 

భోధన్ సీఐ విజయ్‌ బాబు తెలియజేసిన సమాచారం ప్రకారం, రంగనవేణి సురేష్ (53), హేమలత (45) సామాన్య మద్య తరగతి కుటుంబానికి చెందినవారు. వారికి హరీష్ అనే 22 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కిరాణా దుకాణం నడుపుకునేవారు. వారికి ఓ ఎకరం పొలం కూడా ఉంది. దానిలో కూడా వారు కూరగాయలు పండించేవారు. హేమలతో ఆ కూరగాయలు అమ్ముతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

పరిస్థితులు కాస్త బాగున్నప్పుడు వారు సొంత ఇల్లు నిర్మాణం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత అదే వారికి గుదిబండగా మారింది. దాని నిర్మాణం కోసం అప్పులు చేశారు. వ్యవసాయం కోసం కూడా అప్పులు చేశారు. ఇటీవల సురేష్ తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆయన వైద్యం కోసం మరిన్ని అప్పులు చేయకతప్పలేదు. 

కుటుంబంలో ముగ్గురూ ఎంతగా శ్రమిస్తున్నా ఆ అప్పులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి తప్ప తీరడం లేదు. అన్నీ కలిపి సుమారు రూ.30 లక్షలు వరకు చేరాయి. వాటిని తీర్చేందుకు వారు తమ పొలం అమ్మేస్తే రూ.12 లక్షలే వచ్చింది. మరో రూ.18 లక్షల అప్పులు మిగిలిపోయాయి. 

ఆన్‌లైన్‌లో గేమ్స్ గెలిస్తే భారీగా డబ్బు సంపాదించవచ్చని ఎవరి ద్వారానో తెలుసుకున్న హరీష్, మళ్ళీ అప్పులు చేసి ఆన్‌లైన్‌లో గేమ్స్ లో పెట్టడం మొదలుపెట్టాడు. వాటితో డబ్బు సంపాదించలేకపోయాడు కానీ మళ్ళీ అప్పులు పెరిగిపోయాయి. 

ఈ విషయం తెలుసుకొని తల్లీ తండ్రి అతనని కోప్పడ్డారు. ఇక ఈ అప్పులు తీర్చడం తమ వల్ల కాదని, ఈ బాధలు భరించడం కంటే ఆత్మహత్య చేసుకొని చనిపోవడమే మంచిదని భావించి ముగ్గురూ శనివారం తమ నివాసంలో చూరుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వారి మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలించారు. 

Related Post