ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండె పోటుతో మరణించారు. ఆమె వయసు 38 ఏళ్ళు మాత్రమే. శుక్రవారం అర్దరాత్రి దాటిన తర్వాత గుండెలో నొప్పిగా ఉందని చెప్పగానే రాజేంద్ర ప్రసాద్ ఆమెను హుటాహుటిన హైదరాబాద్, ఏఐజీ హాస్పిటల్‌లో చేర్చారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగా రాత్రి సుమారు ఒంటి గంటకు ఆమె తుది శ్వాస విడిచారు. గుండెపోటు వలన ఆమె మరణించిన్నట్లు వైద్యులు తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్ కూతురిలో తల్లిని చూసుకుంటూ ఆమెను అమితంగా ప్రేమిస్తుంటారు. అదేవిషయం ఆయన చాలా సార్లు మీడియా ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. అంతగా ప్రేమించిన కుమార్తె చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రాజేంద్ర ప్రసాద్‌కి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. ఆ కూతురు (గాయత్రి) కుమార్తె సాయి తేజస్విని మహానటి సినిమాలో చిన్నారి సావిత్రిగా అద్భుతంగా నటించింది. ఇప్పుడు ఆ పాప కూడా తనలాగే తల్లి లేనిదైపోయిందని రాజేంద్ర ప్రసాద్ మనుమరాలిని పట్టుకొని విలపిస్తుంటే ఎవరూ ఆయనని ఓదార్చలేకపోతున్నారు.
ఈ విషాదవార్త తెలియగానే తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు వచ్చి ఆయనని పరామర్శిస్తున్నారు.