తిరుమలలో ఆర్జిత సేవలు ఎన్నో కానీ ఆ ఒక్కటీ స్పెషల్!

September 29, 2024
img

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపుసేవ వరకు ఎన్నో సేవలలో పాల్గొని తమ జన్మ తరించిందనుకుంటారు. అయితే ఒకే రోజున వీటన్నిటిలో పాల్గొని చూసి తరించే మరొక సేవ కూడా ఉంది. అదే.. ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్‌ ధర కోటి రూపాయలు మాత్రమే.

భక్తులు, సంస్థలు ఎవరైనా కోటి రూపాయలు చెల్లించి ఏడాదిలో తమకు నచ్చిన రోజున ఈ అన్ని సేవలలో పాల్గొనవచ్చు. తెల్లవారుజాము నుంచి అర్దరాత్రి వరకు ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సమక్షంలో ఉండవచ్చు. 

ఈ ఉదయాస్తమాన సేవ టికెట్స్ కోసం చాలా మంది పోటీపడుతుండటంతో కొన్నేళ్ళపాటు దీనిని టీటీడీ నిలిపివేయాల్సి వచ్చింది. మళ్ళీ 2021 నుంచి ఇది అందుబాటులోకి తెచ్చింది. 

వారంలో అన్ని రోజులు ఈ టికెట్‌ ధర కోటి రూపాయలు ఉంటుంది. కానీ శుక్రవారం ఒక్కరోజు కోటిన్నర ఉంటుంది. ఈ ఏడాదిలో మిగిలిన అన్ని శుక్రవారాల టికెట్స్ బుక్ అయిపోయాయి.  మిగిలిన రోజులకి ప్రస్తుతం 374 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఒకసారి కోటి రూపాయలు చెల్లించి ఈ ఉదయాస్తమాన సేవ టికెట్‌ కొనుగోలు చేస్తే ఆ వ్యక్తి జీవించినంత కాలం లేదా 25 సంవత్సరాలు ఏది ముందయితే అంతవరకు వినియోగించుకోవచ్చు. అదే కంపెనీలకైతే 20 సంవత్సరాలు మాత్రమే పరిమితం. 

మా దగ్గర బోలెడు డబ్బు ఉంది. కనుక ఎన్ని టికెట్స్ అయినా కొనగలమనుకుంటే సాధ్యం కాదు. ఒక వ్యక్తికి ఒక్క టికెట్‌ మాత్రమే ఇస్తారు. 

ఈ టికెట్‌ కొనుగోలు చేసినవారితో ఆరుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు. ఏ కారణం చేతయినా రాలేకపోతే వారి స్థానంలో మరొకరిని అనుమతిస్తారు. కుటుంబ సభ్యుల స్థానంలో మార్పులు చేర్పులు ఒకే ఒక్కసారి అనుమతిస్తారు.

అదే... కంపెనీలకైతే ఏటా ఈ సేవలో పాల్గొనేవారి స్థానంలో వేరేవారిని ఎంపికచేసి పంపించవచ్చు. ఈ సేవలలో పాల్గొనేవారికి స్వామివారి వస్త్రాలు, ప్రసాదం అందజేస్తారు. టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా కానీ నేరుగా తిరుమల కౌంటర్ల వద్ద నగదు చెల్లించి ఈ ఉదయాస్తమానా సేవా టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. 

Related Post