పట్టు చీరలు, ఆ చీరలలో వెండి తీగలు వగైరా ముచ్చట్లు అందరికీ తెలిసినవే. అయితే బంగారంతో తయారుచేసిన చీరని ఎవరూ ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. రాజన్న సిరిసిల్లా పట్టణానికి చెందిన నల్ల విజయ్ కుమార్ అనే ఓ చేనేత కళాకారుడు 200 గ్రాముల బంగారం నుంచి జరీతీగలు తీసి వాటితో ఓ అద్భుతమైన చీర నేశారు.
హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపార వేత్త ఆరు నెలల క్రితం తనకు ఈ చీర ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. బంగారు జరీ తీసీ, చీర డిజైన్ చేయడానికి 10-12 రోజుల సమయం పట్టిందని విజయ్ కుమార్ చెప్పారు. ఈ చీర పొడవు 5.5 మీటర్లు, చీర అంచు వెడల్పు 49 అంగుళాలు ఉంటుందని తెలిపారు.
అయితే 200 గ్రాముల బంగారం, పట్టు కలిపి నేసిన ఈ చీర బరువు ఒక కేజీ కంటే తక్కువే ఉంటుందని చెప్పారు. చీర బరువు సుమారు 900 గ్రాములు వరకు ఉంటుందని చెప్పారు.
చీర ఆర్డర్ ఇచ్చిన వ్యాపారవేత్త కూతురు పెళ్ళి ఆ ఈ నెల 17వ తేదీన జరుగబోతోందని, ఆలోగా చీర నేయడం పూర్తి చేసి అందించబోతున్నానని విజయ్ కుమార్ చెప్పారు. చీర ఖరీదు సుమారు రూ.18 లక్షల వరకు ఉంటుందని, బంగారం ఉపయోగించి ఇంత ఖరీదైన చీర నేయడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.