హైదరాబాద్, బాలాపూర్ గణేశ్ ఉత్సవాల ముగింపులో బొడ్రాయి వద్ద నిర్వహించే లడ్డూ ప్రసాదం వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూనే ఉంది.
గత ఏడాది వేలంపాటలో దయానంద రెడ్డి అనే భక్తుడు రూ.27 లక్షలకు సొంతం చేసుకున్నారు. దాని ఆధారంగా ఈసారి నిర్వాహకులు వేలంపాటకు కొత్త నిబంధన పెట్టారు. వేలంపాటలో పాల్గొనేవారు ముందుగా రూ.27 లక్షలు డిపాజిట్ చేయాలనే నిబంధన పెట్టడంతో గొప్ప కోసమో, పేపర్లలో తమ పేర్లు, ఫోటోలు చూసుకోవడం కోసమో వేలంపాటలో పాల్గొనేవారిని ఫిల్టర్ చేయగలిగారు. దీంతో అతి కొద్దిమందే రూ.27 లక్షలు డిపాజిట్ జమా చేసి వేలంపాటలో పాల్గొన్నారు.
అయినప్పటికీ వేలంపాటలో పాల్గొన్నవారు గట్టిగా పోటీ పడటంతో ఈసారి కొలను శంకర్ రెడ్డి అనే భక్తుడు రూ.30,01,000కి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “మా కుటుంబానికి స్వామివారి లడ్డూ ప్రసాదం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పటివరకు మాకు తొమ్మిదిసార్లు లడ్డూ ప్రసాదం లభించింది. ఈ లడ్డూ ప్రసాదాన్ని ప్రధాని నరేంద్రమోడీకి అంకితం చేస్తున్నాను,” అని అన్నారు.