తిరుపతికి చెందిన కౌశిక్ అనే జూ.ఎన్టీఆర్ వీరాభిమాని బ్లడ్ క్యాన్సర్ చివరి దశ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృత్యువుతో పోరాడుతున్నాడు. అతని వయసు కేవలం 19 ఏళ్ళే. ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను, సెప్టెంబర్ 27న ‘దేవర’ సినిమా చూసే వరకు తనని బ్రతికించి ఉంచమని వైద్యులను వేడుకుంటున్నాడని అతని తల్లి తండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటూ మీడియాకి చెప్పారు. అతనికి ‘బోన్ మారో ఆపరేషన్’ చేసేందుకు రూ.60 లక్షలు ఖర్చవుతాయని అంత సొమ్ము తమ వద్ద లేక కొడుకు ప్రాణాలు కాపాడుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పారు.
ఈవిషయం జూ.ఎన్టీఆర్ చెవిన పడటంతో కౌశిక్‌కి వీడియో కాల్ చేసి మాట్లాడారు. దేవర తప్పకుండా చూద్దువు కానీ ముందు ధైర్యంగా ఉండాలని జూ.ఎన్టీఆర్ హితవు చెప్పారు. త్వరలోనే వీలు చూసుకొని వచ్చి కలుస్తానని జూ.ఎన్టీఆర్ చెప్పారు.
ఈ జన్మకి దేవర సినిమా చూస్తే చాలనుకున్న కౌశిక్‌కి తన అభిమాన హీరో జూ.ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం, వచ్చి కలుస్తానని చెప్పడంతో ఆనందం ఉప్పొంగి పోయాడు.
అతని ఆపరేషన్‌కు అవసరమైన ఆర్ధికసాయం చేస్తానని జూ.ఎన్టీఆర్ అతని తల్లి తండ్రులకి మాట ఇచ్చారు. మృత్యువుతో పోరాడుతున్న ఓ వ్యక్తికి భగవంతుడే ప్రత్యక్షమై వరం ఇచ్చిన్నట్లుంది కదా!