తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ఇక లేరు

September 06, 2024
img

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ యశోధా ఆస్పత్రిలో కన్ను మూశారు. మెదడుకి ఇన్ఫెక్షన్ సోకడంతో కొన్ని రోజులుగా యశోధా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిపోయిన  జిట్టా, సొంత డబ్బుతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయించారు. తన సామాజిక సేవలతో జిట్టా రామకృష్ణా రెడ్డి ప్రజలలో చాలా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, రాజకీయంగా రాణించలేకపోయారు. ఆయన ముక్కు సూటితనం, నిజాయితీయే అందుకు కారణమని కొందరు అభిప్రాయపడుతుంటారు.   

తెలంగాణ మలిదశ ఉద్యమాలలో చురుకుగా పనిచేస్తున్నప్పుడు జిట్టా కేసీఆర్‌కి దగ్గరయ్యారు. ఆయన పిలుపుమేరకు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ దానిలో ఇమడలేక ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలు మారి మళ్ళీ చివరికి గత ఏడాది సెప్టెంబర్‌లో బిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. 

జిట్టా బాలకృష్ణా రెడ్డి అంత్యక్రియలు భువనగిరి శివారులోని ఆయన ఫామ్‌హౌస్‌లో నేడు జరుగుతాయి. ఆయన అన్ని పార్టీలలో పనిచేసినందున అందరూ ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

Related Post