శనివారం నుంచి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల ముందే అంటే నేటితో ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం ముస్తాబులన్నీ పూర్తయ్యాయి. నేడు గణేశ్ విగ్రహం కళ్ళకి రంగులతో సుందరంగా తీర్చిదిద్దడంతో నవరాత్రి ఉత్సవాలకు సప్తముఖ మహాశక్తి గణపతి సిద్దంగా ఉన్నాడు.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు ప్రారంభించి ఈ ఏడాదితో 70 సంవత్సరాలు. కనుక 70 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేందర్ నేతృత్వంలో 200 మంది కార్మికులు నెలన్నర రోజులలో విగ్రహాన్ని నిర్మించారు.
విగ్రహ నిర్మాణం కోసం చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలని తొలగించి రేపటి నుంచి మండపం అలంకరణ పనులు మొదలుపెడతామని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ చెప్పారు.
వినాయకచవితి తొలి పూజకు సిఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించామని చెప్పారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని ఆహ్వానించారు.