కొన్ని వందల తెలుగు సినిమాలలో హాస్య నటుడుగా, విలన్‌గా నటించి అందరినీ మెప్పించిన మన ఫిష్ వెంకట్‌కి ఊహించనన్ని కష్టాలు చుట్టుముట్టాయి. షుగర్, బీపీ వ్యాధుల కారణంగా రెండు కిడ్నీలు చెడిపోయాయి. గత ఏడాదిగా హైదరాబాద్ నీమ్స్ హాస్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు చేతిలో పైసా లేక గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నానని ఫిష్ వెంకట్ చెప్పారు.
షుగర్ వ్యాధి వలన రెండు కాళ్ళకు పుళ్ళుపడి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ఈ రెండు వ్యాధుల కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. దీంతో చాలా కాలంగా సినిమాలలో నటించలేక రామ్ నగర్‌లో ఇంటికే పరిమితం అయ్యారు.
సినిమాలు చేయలేకపోవడంతో ఆయన ఆర్ధిక పరిస్థితి ఒక్కసారిగా తల్లక్రిందులైంది. డయాలసిస్ చేయించుకోవడానికి, మందులకు ఖర్చులకు కూడా డబ్బులేక చాలా నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని నిర్మాత చదలవాడ లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. తన కష్టాన్ని తెలుసుకొని వెంటనే సాయం చేసినందుకు చదలవాడకి ఫిష్ వెంకట్ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఒకప్పుడు ఎందరికో సాయం చేసిన తాను ఈనాడు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నానని ఫిష్ వెంకట్ చెప్పడం ఎవరినైనా కలిచివేస్తుంది. కనుక దాతల సాయం ఇప్పుడు ఆయనకు చాలా అవసరం.
అయితే ఇది ఓ లక్ష, రెండు లక్షలతో తీరే సమస్య కానే కాదు. కిడ్నీ దాత దొరికితే, కిడ్నీ ఆపరేషన్ జరిగితే తప్ప ఫిష్ వెంకట్ పరిస్థితి మారే అవకాశం లేదు. కనుక తెలంగాణ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ ఆయన భాద్యతని తీసుకుని అవసరమైన చికిత్స చేయించి ఆర్ధిక సాయం చేయగలిగితే బాగుంటుంది.