భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటం కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. అయితే మేడిగడ్డ బ్యారేజి గేట్లు మూసి వరద ప్రవాహాన్ని తగ్గించలేనందున వచ్చిన నీటిని వచ్చిన్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ వరద నీరు భద్రాచలంలో పోటెత్తుతోంది.
మంగళవారం అర్దరాత్రి భద్రాచలం వద్ద నీటి మట్టం 41 అడుగులు ఉండగా మర్నాడు మధ్యాహ్నానికి 43 అడుగులు, సాయంత్రానికి 44.1 అడుగులకు పెరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ జితేష్ సూచన మేరకు మొదటి ప్రమాద హెచ్చరికని అధికారులు జారీ చేశారు.
ఈ నెల 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపధ్యంలో భద్రాచలంలో గోదావరి నీటి మట్టం ఇంకా పెరిగితే నదీ పరీవాహక ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.