ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో మహబూబాబాద్ జిల్లాలో పలు గ్రామాల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. భారీ వర్షాలకు వందలాది ఇళ్ళు కూలిపోవడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరద నీరు పంట పొలాలని ముంచెత్తడంతో చేతికి అందివచ్చిన పంటలు పోయాయి. వ్యవసాయ భూములలో భారీగా ఇసుక పేరుకుపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో పెద్ద చెరువుతో సహా మొత్తం 45 చెరువులకు గండ్లు పడటంతో వరద నీరు గ్రామాలని ముంచెత్తింది. శనివారం అర్దరాత్రి ఇనుగుర్తిలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఏకంగా 45.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఓ పక్క కుండపోతగా కురుస్తున్న భారీ వర్షం, మరోపక్క గండ్లు పడిన చెరువుల నుంచి వరదనీరు గ్రామాలని ముంచెత్తడంతో గాడ నిద్రలో ఉన్న గ్రామస్తులకు ఏమి జరుగుతోందో గ్రహించేలోగానే తీరని నష్టం జరిగిపోయింది.
అనేక ఇళ్ళు పాక్షికంగా కూలిపోగా, మూగజీవాలు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జిల్లాలో పలు రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయ సిబ్బంది కూడా అక్కడకు చేరుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ముల్కలపల్లి రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది.
జిల్లాలో నెల్లికుదురు మండలం రావిరాల, ఇనుగుర్తి, రాజుల కొత్తపల్లి, చిన్న నాగారం చెరువులకు గండ్లు పడగగా ఆకేరు, పాకాల, మున్నేరు, పాలేరు, వట్టేవాగు, బందం చెరువు కుంట, జిన్నెల వాగులు పొంగి ప్రవహించి చుట్టుపక్కల గ్రామాలని ముంచెత్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం ముందు మూడు అతిపెద్ద సవాళ్ళు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాని పునరుద్దరించడం, ఇళ్ళు, పంటలు, పశువులు సర్వస్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవడం, భవిష్యత్‌లో చెరువులు గండ్లు పడి ఊర్లను ముంచెత్తకుండా కట్టలను పునర్నిర్మించడం. ఇప్పటికే ప్రభుత్వం సహాయ చర్యలను ప్రారంభించింది.