బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో నేటి నుంచి శనివారం వరకు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని కనుక అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇంతవరకు కురిసిన వర్షాలకే వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ఉమ్మడి ఖమ్మం, మహబూబాద్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఖమ్మం జిల్లాలో పోలీసుల సాయంతో ప్రజలు మళ్ళీ ఇళ్ళు, దుకాణాలు చక్కబెట్టుకుంటున్నారు. ఇంకా తేరుకోకమునుపే మళ్ళీ భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గడచిన 24 గంటలలో సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో 17 సెంటీ మీటర్లు, నిజామాబాద్‌లోని నందిపేట, మాక్లూర్‌లో 13, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎల్లందులో 13, సిద్ధిపేటలో నాంగనూర్‌లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్ష సూచనతో ఖమ్మం జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 6వరకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సెలవులు పొడిగించే అవకాశం ఉంది.