ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు చేపడుతున్న సహాయ చర్యలు చాలా అభినందనీయం. పోలీస్ కమీషనర్ సునీల్ దత్ 525 మంది ట్రైనీ పోలీసులను పంపించి రూరల్ మండలంలో కరుణగిరి పరిసర ప్రాంతాలలోని రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, ఖమ్మం టౌన్ పరిధిలోనే బొక్కలగడ్డ, ధంసాలపురం వీధులలో రోడ్లపై, కాలువలలో పేరుకుపోయిన మట్టి, బురద, చెత్త తొలగింపజేయిస్తున్నారు.
పోలీసులు కూడా అది ఇబ్బంది అనుకోకుండా చాలా చురుకుగా పరిసర ప్రాంతాలన్నీ శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల్లా ప్రతీ ఇంటినీ శుభ్రం చేస్తున్నారు. వాటిలో వస్తువులు బయటకు తీసుకొచ్చి శుభ్రం చేసి మళ్ళీ ఇంట్లో సర్ధిపెడుతున్నారు. ఇంతగా తమకు సేవలు చేస్తున్న పోలీసులను చూసి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదేపదే వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.