రైల్లో ఆకయితాల అల్లరికి 12 మందికి గాయాలు

August 11, 2024
img

ఉత్తరప్రదేశ్‌లో బిల్‌పుర్ వద్ద నడుస్తున్న రైల్లో నుంచి 12 మంది ప్రయాణికులు దూకేసి తీవ్రంగా గాయపడ్డారు. హౌరా నుంచి అమృత్సర్ ఎక్స్‌ప్రెస్‌ రైలు యూపీలోని బరేలీ స్టేషన్ సమీపిస్తుండగా జనరల్ బోగీలో మంటలు అంటుకున్నాయని రైల్లో వదంతులు వ్యాపించడంతో, 12 మంది ప్రయాణికులు ప్రాణ భయంతో నడుస్తున్న రైల్లో నుంచి దూకేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. 

అయితే రైల్లో ఎటువంటి అగ్నిప్రమాదం జరుగలేదు. జనరల్ బోగీలో కొందరు ఆకతాయిలు అగ్నిమాపక పరికరం ఎలా పనిచేస్తుందో పరీక్షించేందుకు దాని లివర్ నొక్కగా సిలిండర్ నుంచి దట్టమైన తెల్లటి పొగలు రాసాగాయి. ఆ పొగ రైలు కిటికీల గుండా బయటకు వ్యాపిస్తుండటం చూసిన ప్రయాణీకుడు ఎవరో పక్క బోగీలో మంటలు అంటుకున్నాయని గట్టిగా అరిచారు. వెంటనే కొందరు ప్రయాణికులు ఎమర్జన్సీ చైన్ లాగడంతో రైలు మెల్లగా నిలిచిపోయింది. 

కానీ అంతలోనే ప్రాణ భయంతో నడుస్తున్న రైలులో నించి కిందకు దూకేసి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని గాయపడిన ప్రయాణికులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో ఇది ఆకతాయిల పని అని తేలింది. కానీ వారు అప్పటికే రైలు దిగి పారిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Related Post