కర్ణాటకలో రెండు కుటుంబాలలో ఊహించని విషాదం సంభవించింది. చంవరసనహళ్లి గ్రామానికి చెందిన నవీన్ (26) కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఉద్యోగి. లిఖిత (22) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల అంగీకారంతో మొన్న ఆగస్ట్ 7వ తేదీన స్వగ్రామంలో పెళ్ళి చేసుకున్నాడు.
తమ ప్రేమ ఫలించడంతో నూతన దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. మధ్యాహ్నం భోజనాల కార్యక్రమం ముగిసిన తర్వాత వారిరువురూ అదే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళి కాసేపు హాయిగా అందరూ కబుర్లు చెప్పుకున్నారు.
ఆ తర్వాత కాసేపు అదే ఇంట్లో ఓ గదిలో ఇద్దరూ విశ్రాంతి తీసుకున్నారు. కొంత సేపు తర్వాత గదిలో నుంచి నవీన్, లిఖిత అరుపులు వినిపించడంతో వారి బంధువులు లోపలకి వెళ్ళి చూడగా నవీన్, లిఖిత ఇద్దరూ తీవ్ర గాయాలతో రక్తం కారుతూ నేలపై పడి ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు.
బంధువులు వారిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ లిఖిత చికిత్స పొందుతూ బుధవారం మరణించగా, నవీన్ గురువారం మరణించాడు.
వారిద్దరూ గదిలోకి వెళ్ళిన తర్వాత ఏదో విషయమై వాదించుకున్నారని అప్పుడు నవీన్ ఆమెపై కత్తితో దాడి చేయగా ఆమె కూడా అదే కత్తితో దాడి చేయడంతో ఇద్దరూ చనిపోయి ఉండవచ్చని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో కనుగొన్నారు. కానీ పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
ప్రేమించి పెళ్ళి చేసుకున్నా నవీన్, లిఖిత పెళ్ళైన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.