భద్రాచలంలో నీట మునిగిన దుకాణాలు

August 07, 2024
img

గత రెండు మూడు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈరోజు ఉదయానికి వరద నీరు భద్రాచలం పట్టణంలోకి ప్రవహించడంతో ఆలయ సన్నిధి పడమర మెట్ల మార్గం వద్ద నడుము లోతు నీళ్ళు చేరాయి. అక్కడకి సమీపంలోనే ఉన్న దాదాపు 35 దుకాణాలు వరద నీటిలో మునగడంతో వస్తువులన్నీ తడిసిపోయాయి.  

స్థానిక వ్యాపారి మీడియాతో మాట్లాడుతూ, “ఈ సమస్య కొత్తగా వచ్చింది కాదు గత 10-15 ఏళ్ళ నుంచే మొదలైంది. అప్పటి నుంచి మేము ఎమ్మెల్యేలకు, అధికారులకు మొర పెట్టుకుంటూనే ఉన్నాము. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ఎవరూ మా సమస్యని పరిష్కరించడం లేదు. ఇంక ఎవరికి మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే లేడని భావించి మేము నమ్ముకున్న ఆ భద్రాద్రి సీతారాములపైనే భారం వేసి జీవిస్తున్నాము,” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏపీలో పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాతే భద్రాచలంలోకి బ్యాక్ వాటర్స్ ప్రవేశిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అది జాతీయ ప్రాజెక్టు, దానిపై ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు చేశారు. కనుక దానిని నిలిపివేయడం సాధ్యం కాదు.

కనుక బ్యాక్ వాటర్స్ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలదే. వరద ముంపుని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలంలో గోదావరి ఒడ్డున పెద్ద గోడ నిర్మిస్తోంది. అది వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెపుతున్నారు. కనుక అంత వరకు భద్రాచలం వాసులకు ఈ ఇబ్బంది తప్పదు.

Related Post