ఏ స్త్రీకైనా ప్రసవం పునర్జన్మ వంటిది. బిడ్డ కోసం ఎంత ప్రసవ వేదన భరించేందుకైన మాతృమూర్తులు సిద్దపడతారు. కానీ ఖమ్మం జిల్లా తల్లాడ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఇన్‌చార్జి వైద్యుడు డాక్టర్ వై గోపీ నిర్లక్ష్యం లేదా చాతకానితనం కారణంగా ఓ మాతృమూర్తికి తీరని ఆవేదన మిగిలింది.
తల్లాడ మండలంలోని మల్లారానికి చెందిన దడిపల్లి లావణ్యకు శుక్రవారం రాత్రి నొప్పులు మొదలవడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు హుటాహుటిన తల్లాడ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. ఇన్‌చార్జి డాక్టర్ వై గోపీ నర్సింగ్ సిబ్బందితో కలిసి ఆమెకు ప్రసవం చేస్తుంటే గర్భంలో శిశువు అడ్డం తిరగడంతో సగ భాగమే బయటకు వచ్చింది.
దాంతో బిడ్డ తల్లి పల్స్ రేట్ వేగంగా పడిపోసాగింది. ఆ పరిస్థితిలో శిశువుని బయటకు తీయడం సాధ్యం కాదని వెంటనే ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళాలంటూ డాక్టర్ గోపీ ప్రసవం చేయకుండా చేతులెత్తేశాడు.
ఆ పరిస్థితిలో వేరే ఆస్పత్రికి ఎలా తీసుకువెళ్ళగలమని కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో, అతి కష్టం మీద బిడ్డని బయటకు తీశాడు. కానీ బిడ్డ తల తల్లి గర్భంలో చాలాసేపు ఉండిపోవడంతో ఉమ్మనీరు తాగి ఊపిరి ఆడక చనిపోయింది.
బిడ్డ తల్లి లావణ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళగా వైద్యులు ఆమెకు చికిత్స చేసి ప్రాణాపాయం తప్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ పిహెచ్‌సి వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయింది.
వైద్యుడి నిర్లక్ష్యం చాతకనితనం వలననే తన బిడ్డ చనిపోయిందంటూ తండ్రి, బంధువులు తల్లాడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ధర్నా చేశారు. తక్షణం ఆ వైద్యుడిని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.