తెలుగు సినీ నటుడు రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో మలుపు తిరిగింది. మొదట అతను తనను ప్రేమ పేరుతో వాడుకొని మరో అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తూ తనను మోసం చేశాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడితో ఆగి ఉండి ఉంటే పోలీసులు ముందుగా రాజ్ తరుణ్ ని పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారించి ఉండేవారు. కానీ లావణ్య తన పిర్యాదులో అతను తనను వేధిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని, అతని వలన తనకు ప్రాణ భయం ఉందని, కనుక తనకు పోలీస్ రక్షణ కల్పించాలని కోరడంతో కేసు మలుపు తిరిగింది.
పోలీసులు తిరిగి ఆమెకే సెక్షన్ 91 ప్రకారం నోటీస్ ఇచ్చారు. రాజ్ తరుణ్ ఆమెను వేధిస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు సాక్ష్యాధారాలు చూపాల్సిందిగా కోరుతూ పోలీసులు ఆమెకు నోటీస్ ఇచ్చారు.
ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ స్పందిస్తూ, తాను ఆమెతో సహజీవనం చేసిన మాట వాస్తవమే కానీ ఆమె మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, మస్తాన్ అనే మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో బ్రేకప్ చెప్పానని అన్నారు.
ఆమె మాదక ద్రవ్యాలు సేవించి ఓసారి పోలీసులకు పట్టుబడిందని, దానికీ ఆమె తాననే నిందిస్తోందని రాజ్ తరుణ్ ఆరోపించారు. త్వరలోనే తాను కూడా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అప్పుడు విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని రాజ్ తరుణ్ అన్నారు.