అనారోగ్య సమస్యలతోనే రూపాదేవి ఆత్మహత్య

June 22, 2024
img

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం తన భార్య రూపాదేవి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె గురువారం రాత్రి ఆల్వాల్‌లోని తమ నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె ఇద్దరు పిల్లలు యోజిత్, రిషిక, తల్లి భూలక్ష్మమ్మ ఇంట్లోనే ఉన్నారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోజు ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలో పనుల మీద బయట తిరుగుతున్నారు. రాత్రి సుమారు 10.30 గంటలకు రూపాదేవి భర్తకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి తిరిగి రావాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. 

ఆయన ఇంటికి చేరుకునేలోగానే రూపాదేవి తమ బెడ్ రూమ్‌లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. కీడు శంకించిన ఆమె తల్లి భూలక్ష్మమ్మ ఇరుగుపొరుగులను పిలిచి తలుపులు బద్దలు కొట్టించి కూతురుని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. హడావుడిగా ఇంటికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే సత్యం భార్య చనిపోవడం చూసి షాక్ అయ్యారు.  

రూపాదేవి చాలా కాలంగా గైనిక్ సమస్యలతో బాధపడుతున్నారని, ఆ కారణంగా కడుపునొప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నారని ఆమె తల్లి భూలక్ష్మమ్మ చెప్పారు. 

అంతకు ముందురోజే ఎమ్మెల్యే సత్యం, రూపాదేవి, పిల్లలను తీసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని తిరిగి వచ్చారు. సత్యం, రూపాదేవిలు ఓయూలో న్యాయవిద్య చదువుతున్నప్పుడు ప్రేమలో పడి 2012లో పెళ్ళి చేసుకున్నారు. వారికి యోజిత్ (11) రిషిక (8) ఇద్దరు పిల్లలున్నారు. 

రూపాదేవి మేడ్చల్ రావల్‌కోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలలో భర్త గెలిచి ఎమ్మెల్యే అయినప్పుడు ఆమె చాలా సంతోషంగా పాఠశాలలో అందరికీ స్వీట్లు పంచారు. భార్య, భర్తల మద్య ఎటువంటి మనస్పర్ధలు లేవని ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని అందరూ చెపుతున్నారు. 

రూపాదేవి చాలా సున్నిత మనస్కురాలని కనుక కడుపునొప్పితో బాధ పడుతున్నప్పుడు భర్త పక్కన లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తల్లి భూలక్ష్మమ్మ చెప్పారు. 

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య ఈవిదంగా బలవన్మరణానికి పాల్పడటంతో ఎమ్మెల్యే సత్యం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భార్య అంత్యక్రియలు చేస్తుంటే చూస్తున్నవారు కూడా కంట తడిపెట్టారు. మంత్రులు శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు కూడా ఆమె అంత్యక్రియలలో పాల్గొని ఎమ్మెల్యే సత్యం, పిల్లలని ఓదార్చారు.

Related Post