మేడ్చల్లో పట్టపగలు బంగారం షాపులో దోపిడీ

June 20, 2024
img

మేడ్చల్లో గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు ఇద్దరు దుండగులు బురఖాలు ధరించి స్థానిక జగదాంబ బంగారు ఆభరణాల దుకాణంలో నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు. తమని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇద్దరూ బురఖాలు ధరించి వచ్చారు. వారిలో ఒకరు కత్తి చూపిస్తూ యజమానిని భయపెట్టి నగలు దోచుకునేందుకు ప్రయత్నిస్తుండగా మరొకడు డిస్‌ప్లే కౌంటర్‌లో నుంచి నగలు తీసి తన బ్యాగులో వేసుకునేందుకు ప్రయత్నించాడు. కౌంటర్‌లో ఉన్న సేల్స్ బాయ్ వారిని చూసి భయపడి లోనికి పారిపోయి దాక్కొన్నాడు. 

దొంగలు కత్తి చూపి బెదిరిస్తుంటే దుకాణా యజమాని తెలివిగా నగలు తీసుకోమని చెపుతూనే వారిని తోసేసి బయటకు పరిగెత్తి ‘చోర్ చోర్...’ అని అరుస్తుండటంతో, దొంగలు ఇద్దరూ బైక్‌పై పరారీ అయ్యారు. 

పారిపోతున్న వారిపై దుకాణా యజమాని ఓ స్టూల్ విసరగా వెనుక కూర్చున్న దొంగకు అది తగిలింది. కానీ వారు ఆగకుండా బైక్‌పై పారిపోయారు. 

దుకాణా యజమాని సమాచారం ఇవ్వడంతో పోలీసులు, క్లూస్ టీమ్‌ అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి, దుకాణం లోపల, బయట, చుట్టూ పక్కల ప్రాంతాలలో ఉన్న సిసి కెమెరాల రికార్డింగ్ ఆధారంగా వారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో పట్టపగలే బంగారు నగల దుకాణంలో దోపిడీకి ప్రయత్నం జరుగడం చాలా ఆందోళనకరమైన విషయమే.


Related Post