విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం

November 20, 2023
img

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం. ఒడ్డున లంగరు వేసున్న మరబోట్లలో ఒక దానిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాలలో పక్కనే ఉన్న బోట్లకు వ్యాపించడంతో సుమారు 40కి పైగా మరబోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే 40 బోట్లు మంటలలో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ కోట్లాది రూపాయలు విలువ చేసే మర బోట్లు కాళి బూడిదయ్యాయి. 

ఈ బోట్లలో చేపలు పట్టేందుకు బయలుదేరినప్పుడు ఒక్కోసారి 10-15 రోజులు సముద్రంలోనే ఉండిపోతారు. కనుక బోట్లలో పెట్రోల్ లేదా డీజిల్ కూడా వెంట తీసుకువెళుతుంటారు. అంతవరకు సిబ్బందికి టీలు, అల్పాహారం, భోజనం వండుకొనేందుకు బోట్లలో గ్యాస్ సిలిండర్లు కూడా తీసుకువెళుతుంటారు. పైగా మరబోట్లను కలప లేదా ఫైబర్ గ్లాస్‌తో తయారు చేస్తారు.

కనుక అగ్నిప్రమాదం జరిగే అవకాశాలు, జరిగితే క్షణాలలో బోట్లు కాలిబూడిదయ్యే అవకాశాలు ఎక్కువ. ఇదే కారణంగా ఒడ్డున పక్కపక్కనే లంగరు వేసున్న సుమారు 40 బోట్లకు మంటలు శరవేగంగా వ్యాపించిన్నట్లు స్పష్టమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎవరైనా కావాలనే బోట్లకు నిప్పు పెట్టారా లేక ప్రమాదవశాత్తు ఈ అగ్నిప్రమాదం జరిగిందా?అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Related Post