లూలు కొత్త స్వర్గం... వాహనదారులకు కొత్త నరకం!

October 02, 2023
img

ఇటీవల కూకట్‌పల్లిలో లూలు షాపింగ్ మాల్‌ ప్రారంభమైనప్పటి నుంచి దానిని చూసేందుకు, షాపింగ్ చేసేందుకు నగరం నలుమూలల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనం పోటెత్తుతున్నారు. వారాంతపు సేవలవులతో పాటు గాంధీ జయంతి సెలవు కూడా కలిసి రావడంతో వేలాదిగా జనాలు లూలుకి తరలివస్తున్నారు. వారికి అది స్వర్గంలా అనిపించవచ్చు కానీ ఆ మార్గం గుండా నిత్యం రాకపోకలు సాగించేవారు మాత్రం నరకం చూస్తున్నారు. 

లులూ షాపింగ్ మాల్‌కు రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో సుమారు గంట రెండు గంటల సేపు వాహనదారులు దానిలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మియాపూర్ నుంచి బాలానగర్, మూసాపేట వైపు వెళ్లాలంటే ఇప్పుడు కనీసం 2 గంటల సమయం పడుతోంది. 

ఈ విషయం తెలుసుకొన్నవారు ముందుగానే జాగ్రత్తపడి వేరే మార్గాలలో తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు ప్రయత్నిస్తుండటంతో ఫేజ్-9 చౌరస్తా, రమ్యా గ్రౌండ్స్, టెంపుల్ బస్టాప్ తదితర ప్రాంతాలలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. చివరికి లూలు వద్ద ట్రాఫిక్ జామ్ ప్రభావం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాధాపూర్ వరకు చూపిస్తోంది.   

కనుక హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీస్ విభాగం, జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ సమస్యకు తక్షణం పరిష్కార మార్గం కనుగొనవలసి ఉంది.

Related Post