భద్రాద్రిలో విషాదం: డ్రైనేజీలో పడి మహిళా కానిస్టేబుల్ మృతి

October 01, 2023
img

శనివారం భద్రాద్రి కొత్తగూడెంలో ఊహించని విషాద ఘటన జరిగింది. మంత్రి కేటీఆర్‌ పర్యటించవలసి ఉండగా చివరి నిమిషంలో రద్దు అయ్యింది. మంత్రి పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తులో ఉన్న మహిళా కానిస్టేబుల్ రూపన శ్రీదేవి (49) ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కన ఓపెన్ డ్రైనేజీలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఆమె ఖమ్మంలోని సారధి నగర్‌లో నివాసం ఉంటున్నారు. కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. 1995 బ్యాచ్‌కు చెందిన శ్రీదేవి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ఆమె భర్త రామారావు జిల్లా కేంద్రంలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

శనివారం మంత్రి కేటీఆర్‌ భద్రాచలం పర్యటనకు వస్తున్నట్లు సమాచారం అందడంతో ఆమెకు ఆలయ ఆన్నదాన సత్రం వద్ద విధులకు హాజరయ్యారు. కానీ మంత్రి పర్యటనచివరి నిమిషంలో రద్దు అయ్యింది. కానీ బందోబస్తుకు వెళ్ళిన శ్రీదేవి ప్రాణాలు కోల్పోయారు. 

శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతంలోకి ఒక్కసారిగా భారీగా వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆమె పక్కనే ఉన్న సత్రంలోకి వెళుతుండగా దారిలో పొంగి ప్రవహిస్తున్న ఓపెన్ డ్రైనేజిలో జారిపడి కొట్టుకుపోయారు. ఆ ప్రాంతం అంతా వరద నీటితో నిండిపోవడంతో అక్కడ డ్రైనేజీ ఉందని ఆమె గుర్తించలేకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకొన్న పోలీసులు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సాయంతో గోదావరి నదిలో గాలించి కరకట్ట స్లూయిస్ పైపుల వద్ద చిక్కుకొన్న శ్రీదేవి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. 

Related Post