శనివారం ఖమ్మం, లకారం టాంక్ బండ్ వద్ద శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న నందమూరి తారకరామారావు విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ కలిసి ఆవిష్కరించారు. రూ.1.37 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ విగ్రహం ఎత్తు 54 అడుగులు. మొదట దీనిపై న్యాయవివాదాలు ఎదురైనప్పటికీ మంత్రి పువ్వాడ వ్యక్తిగత చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడంతో నేడు లకారం టాంక్ బండ్ వద్ద విగ్రహావిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ప్రసంగం ఖమ్మంతో సహా రాష్ట్రంలో స్థిరపడిన ఆంద్రా ఓటర్లను ఆకట్టుకోనేట్టు సాగింది. “మాకు రాముడు ఎలా ఉంటాడో తెలీదు. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో కూడా తెలీదు. కనుక మాకు రాముడైనా... శ్రీకృష్ణుడైనా... ఎన్టీఆరే. మన తెలుగువారిని మొత్తం దేశప్రజలందరూ గుర్తించేలా చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ శిష్యుడుగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశం, ప్రపంచంలో చాటిచెప్పారు. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. మా నాన్నగారు ఎన్టీఆర్ వీరాభిమాని. అందుకే నాకు ఆయన పేరు పెట్టారు. తారకరామారావు పేరులోనే చాలా పవర్ ఉంది. దక్షిణ భారత దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి హ్యాట్రిక్ సాధించలేదు. తొలిసారిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు,” అని అన్నారు.
కోట్లాది తెలుగువారితో పాటు కేసీఆర్, కేటీఆర్‌లకు కూడా ఎన్టీఆర్‌పై అభిమానం ఉండటం సహజమే. కనుక ఖమ్మంలో నేడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగా కేటీఆర్ ఎన్టీఆర్‌ను ప్రస్తుతించడం సహజమే. అయితే స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా చక్కబెట్టుకోవాలన్నట్లు రాష్ట్రంలో, ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ఆకట్టుకొనేందుకు కేటీఆర్ ఈ చిన్న ప్రయత్నం చేసిన్నట్లు భావించవచ్చు.