మహబూబాబాద్ కోర్టు ఓ హంతకుడికి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. పట్టణంలో శనిగపురంలో ఓ పంక్చర్ షాపులో పనిచేసే మందసాగర్ అనే వ్యక్తి దీక్షిత్ రెడ్డి బాలుడిని కిడ్నాప్ చేసి, తాళ్ళపూసపల్లి వద్ద గల దానమయ్య గుట్టకు తీసుకువెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు.
2020, అక్టోబర్ 18న జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బాలుడిని కిడ్నాప్ చేసి, అతని తల్లితండ్రులను 45 లక్షలు ఇమ్మనమని డిమాండ్ చేశాడు.
మద్యతరగతికి చెందిన వారు అంత సొమ్ము ఏర్పాటు చేయలేక పోలీసులను ఆశ్రయించారు. అయితే డబ్బు తీసుకొని బాలుడిని విడిచిపెడితే అతని ద్వారా తాను పోలీసులకు పట్టుబడతానని భావించిన మందసాగర్, ఆ బాలుడిని నిర్ధాక్షిణ్యంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ తర్వాత కూడా బాలుడు సజీవంగా కావాలంటే తాను అడిగినంత డబ్బూ ఇవ్వాల్సిందే అంటూ ఫోన్లు చేస్తుండేవాడు.
తల్లితండ్రుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా మందసాగర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
మూడేళ్ళ సుదీర్గ విచారణ తర్వాత ఇవాళ్ళ న్యాయమూర్తి మందసాగర్‌కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పు చెప్పారు. కానీ హంతకుడికి హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. చివరిగా రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం అర్జీ పెట్టుకోవచ్చు. కనుక ఈ కేసులు మరో రెండు మూడేళ్ళ వరకు సాగవచ్చు. అంతవరకు అతని ప్రాణాలకు ఢోకా ఉండదు.