డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటుడు నవదీప్, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతని తరపు న్యాయవాది హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. నవదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని హైకోర్టుని అభ్యర్ధించారు. కానీ ఇటువంటి కేసులలో జోక్యం చేసుకోలేమంటూ అతని పిటిషన్ కొట్టేసింది. అయితే పోలీసులు చట్ట ప్రకారం అతనికి నోటీస్ పంపించి విచారణకు హాజరుకావాలని కోరవచ్చని, మరో రెండు రోజుల వరకు అతనిని అరెస్ట్ చేయవద్దని సూచించింది. ఇప్పటికే పోలీసులు అతనికి నోటీస్ అందించేందుకు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్ళగా ఇంట్లో లేకపోవడంతో సిబ్బందికి అందజేసి వచ్చారు.
మాదాపూర్‌లో ఇటీవల ఓ అపార్టుమెంటులో జరిగిన మాదకద్రవ్యాల పార్టీలో ఫిలిమ్ ఫైనాన్సర్ వెంకట రమణా రెడ్డిని, దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ జరిపి వారు ఇచ్చిన ఆధారాలతో ముగ్గురు నైజీరియన్ దేశస్థులతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో 29వ నిందితుడుగా ఉన్న నవదీప్‌తో సహా మరికొందరు పరారీలో ఉన్నారని నగర సిపి సీవీ ఆనంద్ తెలిపారు.