ఈసారి ఖైరాతాబాద్‌ గణేశ్ విగ్రహం ఎత్తు 61 అడుగులు

June 01, 2023
img

గణేశ్ ఉత్సవాలనగానే ఖైరతాబాద్‌ గణేశ్ విగ్రహం ముచ్చట తప్పక వినిపిస్తుంటుంది. వరుసగా 69 ఏళ్ళ నుంచి ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు క్రమం తప్పకుండా భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు ఉత్సవకమిటీ సభ్యులు. ఆనవాయితీ ప్రకారం బుదవారం సాయంత్రం కర్రపూజ నిర్వహించి గణేశ్ విగ్రహం తయారీ పనులకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది 60 అడుగుల విగ్రహం నిర్మించగా ఈసారి 61 అడుగుల మట్టి విగ్రహం తయారుచేయించాలని నిర్ణయించిన్నట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా సందీప్ రాజ్ తెలియజేశారు. గత ఏడాది గణేశ్ విగ్రహం తయారుచేసిన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్, ఆర్టిస్ట్ జోగారావు నేతృత్వంలోనే ఈసారి కూడా గణేశ్ విగ్రహం తయారు చేస్తున్నామని చెప్పారు. వారం రోజులలోగా గణేశ్ విగ్రహం నమూనా చిత్రాలను విడుదల చేస్తామని చెప్పారు. 

ఈ కర్రపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, భాగ్యనగర్ ఉత్సవాకమిటీ కార్యదర్శి భగవంతరావు, ఉపాధ్యక్షుడు కరోడిమల్, గణేశ్ ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సింగరి రాజ్‌ కుమార్‌, డీసీపీ వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ రమణా రెడ్డి, ఏసీపీ సంజీవ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   


Related Post