ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి

February 04, 2023
img

ప్రముఖ నేపద్య గాయని వాణీ జయరాం (78) శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలు కన్ను మూశారు. రెండు రోజుల క్రితమే కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించారు. ఇంతలోనే వాణీ జయరాం కూడా కన్ను మూయడంతో దక్షిణాది సినీ పరిశ్రమకి, ముఖ్యంగా సినీ, సంగీత అభిమానులందరికీ ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. 

వాణీ జయరాం స్వస్థలం తమిళనాడులోని వెల్లూరు. 1945, నవంబర్‌ 30వ తేదీన ఆమె జన్మించారు. ఐదేళ్ళ పసి వయసు నుంచే ఆమె సంగీత ప్రపంచంలోకి ప్రవేశించారు. తన 8వ ఏటనే సంగీత కచేరీ నిర్వహించి పలువురు సంగీతకారుల ప్రశంశలు అందుకొన్నారు. అప్పటి నుంచి పలువురు సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసి కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టారు. పదేళ్ళ వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడటం ప్రారంభించారు. పెళ్ళయిన తర్వాత భర్త జయరాం ప్రోత్సాహంతో ఆమె కర్నాటిక్, హిందూస్థానీ సంగీతాలని కూడా నేర్చుకొని 1969లో అప్పటి బొంబాయి (ముంబై)లో సంగీత కచేరీ ఇచ్చి యావత్ దేశం దృష్టి ఆకర్షించారు. 

అప్పుడే ఆమెకి హిందీ సినీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ‘గుడ్డీ’ హిందీ సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. హిందీలో ఆమె పాడిన పాటలలో ‘బోలో రే పపీ హరా’ పాటకి ప్రతిష్టాత్మకమైన తాన్‌సేన్ అవార్డుతో పాటు నాలుగు అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత ఆమె తొలిసారిగా ‘అభిమానవంతుడు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఇక అప్పటి నుంచి ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి, ఒరియా తదితర 14 భాషల్లో దాదాపు 8 వేలకిపైగా పాటలు పాడారు. 

ఇక కె.విశ్వనాధ్ గారి సినిమాలలో వాణీ జయరాం పాట ఒక్కటైనా తప్పనిసరి. శంకరాభరణం, స్వాతికిరణం మొదలు ఆయన సినిమాలన్నీ ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. వాటిలో ఆమె పాడిన పాటలన్నీ కూడా అంతే సూపర్ హిట్ అయ్యాయి. స్వాతికిరణం సినిమాలో ‘ఆనతి నీయరా హరా...’ పాటకి ఆమెకి జాతీయస్థాయిలో ఉత్తమ గాయని అవార్డు లభించింది. ఇంత సుప్రసిద్ద గాయని వాణీ జయరాం ఇక లేరంటే సంగీతాభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. ఆమె మృతి పట్ల యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related Post