కళా తపస్వి కెవిశ్వనాధ్ ఇకలేరు

February 03, 2023
img

ప్రముఖ సినీ దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాధ్ (92) గురువారం రాత్రి హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకి గురవడంతో కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు కానీ అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు. 

కాశీనాధుని విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పులివర్రు గ్రామం. 1930, జనవరి 19న జన్మించారు. గుంటూరులోనే డిగ్రీ వరకు చదువుకొన్నారు. ఆయన తండ్రి కె.సుబ్రహ్మణ్యం మద్రాస్‌లోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేస్తుండటంతో, డిగ్రీ పూర్తి కాగానే కె.విశ్వనాధ్ అదే స్టూడియోలో సౌండ్ అసిస్టెంట్‌గా చేరారు. 

తొలిసారిగా పాతాళభైరవి సినిమాకి అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు. 1965లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తొలిచిత్రానికే నంది అవార్డు అందుకొన్నారు. దాదాపు 50 సంవత్సరాలపాటు సినీ రంగంలోనే ఉన్నప్పటికీ కె.విశ్వనాధ్ చేసిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. 

ఆయన దాదాపు 50 చిత్రాలు చేయగా వాటిలో చాలా వరకు ఆణిముత్యాలే. 1980, ఫిభ్రవరి 2న విడుదలైన శంకరాభరణం చిత్రం ఆయనకి ఎంతో పేరు ప్రతిష్టలు ఆర్జించిన చిత్రం. ఆ సినిమాతోనే ఆయన కళా తపస్విగా పేరొందారు. కానీ అంతకు ముందు చాలా ఏళ్ళ క్రితమే ఆయన చేసిన సిరిసిరిమువ్వ, చెల్లెలి కాపురం, ఓ సీత కధ, శారద, జీవనజ్యోతి, నేరము శిక్ష వంటి సినిమాలలో కూడా అద్భుతమైన సంగీతం, సాహిత్యం ఉన్న పాటలు జోడించి తన సంగీత పిపాసని చాటుకొన్నారు. 

కె.విశ్వనాథ్ సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు, ఆపద్బాంధవుడు, స్వయంకృషి, స్వరాభిషేకం వంటి ఆణిముత్యాలను అందించి తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించారు. ఆయన హిందీలో కూడా 9 సినిమాలకి దర్శకత్వం వహించారు. 

శుభ సంకల్పం సినిమాతో ఆయన తొలిసారిగా సినిమాలలో నటించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో 30కి పైగా సినిమాలలో నటించి మంచి నటుడిగా కూడా పేరు సంపాదించుకొన్నారు.

సినీ రంగానికి ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ అవార్డు, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకొన్నారు.1985లో విడుదలైన స్వాతి ముత్యం సినిమా ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రం. ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన శంకారాభరణం సినిమా విడుదలైన రోజు (ఫిభ్రవరి 2) నే ఆయన శివైక్యం అయ్యారు. 

కళా తపస్వి కెవిశ్వనాధ్ మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  

Related Post