అయోధ్య రామమందిరానికి నేపాల్ నుంచి భారీ శిలలు

February 02, 2023
img

అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో సీతారాముల విగ్రహాల కొరకు నేపాల్ నుంచి రెండు భారీ శిలలు గురువారం ఉదయం అయోధ్యకి చేరుకొన్నాయి. ఆలయ పూజారులు, స్థానికులు వాటికి పసుపుకుంకుమలతో పూజలు చేసి శ్రీరామజన్మభూమి ట్రస్ట్‌ సభ్యులకి అప్పగించారు. వారు ఆ రెండు శిలలని ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న రామ్ సేవక్ పూర్‌కి తరలించి శిల్పులకి అప్పగించారు. 

నేపాల్ నుంచి ఈ రెండు శిలలని ఎందుకు తీసుకువచ్చారంటే, అక్కడ గంకీ రాష్ట్రంలో గండకీ నది తీరంలో మాత్రమే ఈ పవిత్రమైన సాలిగ్రామ శిలలు లక్షల సంవత్సరాలుగా ఉన్నాయి. వాటిపై విష్ణుముద్రలు కనిపిస్తుంటాయి కనుక హిందువులు వాటిని పరమపవిత్రమైనవిగా భావించి చిన్న చిన్న సాలిగ్రామ శిలలని తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకొని పూజిస్తుంటారు. 

నేపాల్లోని జనక్‌పూర్‌ జానకీమాత జన్మించిన స్థలం. కనుక ఈ రెండు సాలిగ్రామ శిలలని నది ఒడ్డు నుంచి సేకరించిన తర్వాత ముందుగా జనక్‌పూర్‌ తీసుకువెళ్ళి అక్కడ పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అయోధ్యలో రామ మందిరానికి చేరుకొన్నాయి. 


వాటిలో శ్రీరాముడి విగ్రహం చెక్కబోయే శిల బరువు సుమారు 30 టన్నులు కాగా, సీతమ్మవారి విగ్రహం చెక్కబోయే శిల బరువు సుమారు 15 టన్నులు ఉంది. త్వరలోనే మంచి ముహూర్తం చూసి వాటిపై సీతారాముల విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తామని శిల్పులు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రామమందిరంలో పూజలు, భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ అమిత్‌ షా ఇటీవల ప్రకటించారు. 

Related Post