పవన్‌ కళ్యాణ్‌ ధర్మపురి పర్యటనలో అభిమాని మృతి

January 25, 2023
img

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం ధర్మపురిలో పర్యటించినప్పుడు ఓ అభిమాని అత్యుత్సాహంతో బైక్‌ నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయాడు. పవన్‌ కళ్యాణ్‌ ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలలో పాల్గొన్న తర్వాత వందలాది అభిమానులు ఆయన కాన్వాయ్ వెంట బైకులపై సాగారు. 

వారిలో ఓ బైక్‌పై ప్రయాణిస్తున్న కూస రాజ్‌కుమార్‌ (20), జక్కుల అంజి (20) అనే ఇద్దరు అభిమానులు తమ ముందున్న బైక్‌లను తప్పించుకొని ముందుకు దూసుకుపోయారు. అయితే అదే సమయంలో ఎదురుగా ఓ కారు, ఓ బైక్‌ రావడంతో వాటిని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. కానీ వారిలో కూస రాజ్‌కుమార్‌ తలకి తీవ్ర గాయం అవడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనితో పాటు అదే బైక్‌పై ప్రయాణిస్తున్న జక్కు అంజి, వారికి ఎదురుగా బైక్‌పై వచ్చిన బొలిశెట్టి శ్రీనివాస్, నీలం సాగర్ అనే యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కానీ వారికి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ఈ ప్రమాదం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావు పేట వద్ద మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Related Post